పల్లకీ మోసిన దేవుడు

తిరుమల స్వామివారిని దర్శించుకున్న అన్నమయ్య అంతకాలం పాటు ఆ దివ్యమంగళ రూపాన్ని చూడకుండా ఉన్నందుకు బాధపడతాడు. ఇక పై తన జీవితాన్ని ఆ కొండపైన ... ఆ కోనేటి రాయుడి సన్నిధిలోనే కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. అనునిత్యం స్వామివారిని కీర్తనలతో అభిషేకిస్తూ .. భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ అక్కడే ఉండిపోతాడు.

అన్నమయ్య జాడ తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు తిరుమల చేరుకుంటారు. ఆయనకి దూరంగా తాము బతకలేమంటూ ఆవేదనను వ్యక్తం చేస్తారు. అనేక విధాలుగా నచ్చజెప్పి ఇంటికి తీసుకు వస్తారు. ఇంటికి వచ్చినా అయన స్వామి గురించిన ఆలోచనే చేయడం చూసిన తల్లిదండ్రులు, పెళ్లి చేస్తే భక్తి భావనలో నుంచి బయటపడతాడని భావించి, ఆయన దగ్గర ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. అయితే వివాహం చేసుకోవడానికి అన్నమయ్య నిరాకరిస్తాడు.

ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎవరు ఎంతగా చెబుతున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఏడుకొండల వాడే శ్రీదేవి ... భూదేవిలతో కలిసి మారువేషాల్లో అన్నమయ్య ఇంటికి చేరుకుంటాడు. తల్లిదండ్రుల మనసును నొప్పించకుండా వివాహం చేసుకోమని చెబుతాడు. గృహస్తు జీవితాన్ని గడుపుతూనే భగవంతుడికి చేరువైన భక్తుల గురించి ప్రస్తావిస్తాడు. తన మాటను వేంకటేశ్వర స్వామి ఆదేశంగా భావించి వివాహానికి అంగీకరించమని కోరతాడు.

దాంతో అన్నమయ్య వివాహానికి అంగీకారాన్ని తెలియజేస్తాడు. సంతోషంతో పొంగిపోయిన తల్లిదండ్రులు చకచకా అందుకు ఏర్పాట్లు చేస్తారు. వివాహ సందర్భంలో అన్నమయ్య కూర్చున్న పల్లకీని స్వామి ఆనందంగా మోస్తాడు. నిజమైన భక్తుడికి భగవంతుడే సేవ చేస్తాడనే విషయాన్ని స్వామి మరోమారు ఈ లోకానికి తెలియజేస్తాడు.


More Bhakti News