మహాదేవుడి కోవెలలో మహిమగల కోనేరు
కర్నూలు జిల్లా పరిధిలో గల మహానంది క్షేత్రం గురించి తెలియనివాళ్లు ఉండరు. ఈ క్షేత్రంలో ప్రతి అడుగు పవిత్రమైనదనీ ... ప్రతి రాయి మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి అడుగులోనూ పరమశివుడి లీలావిశేషాలను అద్భుతంగా ఆవిష్కరించే ఈ క్షేత్రంలో, కోనేరు కూడా ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక్కడి కోనేరు ... అడుగుభాగం అద్దంలా కనిపించేంతటి స్వచ్ఛమైన నీళ్లను చూస్తే ఇది సాక్షాత్తు సదాశివుడి మనసు నుంచి ఉద్భవించిందేనని అనిపిస్తుంది.
చుట్టూ నీళ్లు ... మధ్యలో మంటపంగల ఈ కోనేరులో స్నానం చేయకపోతే, క్షేత్రదర్శనం ఫలితం దక్కదనే చెప్పాలి. ఇక్కడి పర్వాతాల పైభాగం నుంచి ' శ్రీశైలధార' ... ' నరసింహధార' ... 'దైవోధినిధార' ... 'నందితీర్థం' ... 'కైలాస తీర్థం' అనే అయిదు నీటి ధారలు ప్రధానమైన శివలింగం కింది నుంచి అంతర్వాహినులుగా ఇక్కడి కోనేరులో చేరుతూ ఉంటాయని భావిస్తూ ఉంటారు. పరమశివుడే ఈ ప్రవాహాలను సృష్టించాడని నమ్ముతారు.
ఈ కారణంగానే ఏ కాలంలోనూ ఇందులోని నీళ్లు పొంగిపొర్లడంగానీ ... తగ్గిపోవడంగాని జరగకపోవడం విశేషంగా చెబుతుంటారు. సువిశాలమైన ఈ కోనేరులో ఎంతమంది స్నానాలు చేసినా నీటి స్వచ్ఛత తగ్గకపోవడం ... అసలు ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో ఎవరికీ తెలియకపోవడం వలన ఈ కోనేరు మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కోనేరులో స్నానం చేయడం వలన పాపాలు ... దోషాలు ... వ్యాధులు తొలగిపోతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.