సంతాన సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం

ఆదిదంపతుల పుత్రుడిగా కుమారస్వామి సర్పరూపంలో అవతరించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. సర్పరూపంలో ఆవిర్భవించిన కారణంగానే, సుబ్రహ్మణ్యస్వామిగా పూజలు అందుకుంటున్నాడని అంటారు. అందువల్లనే ఆయన కుమారస్వామిగా విగ్రహరూపంలోనే కాకుండా, లింగ రూపంలోను ... సర్ప రూపంలోను పూజాభిషేకాలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.

ఇక స్వామి సుబ్రహ్మణ్యుడుగా ఆవిర్భవించిన క్షేత్రాలకు మహిళా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఈ రూపంలో స్వామివారు సంతానం లేనివారికి సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉండటమే అందుకు కారణం. అలా స్వామివారు ఆవిర్భవించిన క్షేత్రం మనకి పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి'లో కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి వెనుక స్థలపురాణంగా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది.

పూర్వం అత్రి మహర్షి - అనసూయాదేవిల ఆశ్రమం ఈ ప్రదేశంలోనే ఉండేదట. అనసూయాదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు ఇక్కడికే వచ్చినట్టు చెబుతారు. అత్రి - అనసూయలు నివసించిన కారణంగానే ఈ ప్రాంతానికి 'అత్తిలి' అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. ఇక ఆలయం విషయానికే వస్తే ఒకప్పుడు ఇక్కడ పెద్ద పాము పుట్ట ఉండేదట. ఎంతో తేజస్సు కలిగిన నాగులు ఇక్కడ సంచరించేవట గానీ, ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదట.

దాంతో ఇక్కడి స్థలం మహిమాన్వితమైనదనీ ... సుబ్రహ్మణ్యస్వామికి ఇక్కడి స్థలంతో ఏదో విడదీయరాని సంబంధం ఉందనే విషయాన్ని స్థానికులు గ్రహించారు. అంతా కలిసి ఈ ప్రదేశంలో ఆలయం నిర్మించి పుట్ట ముందుభాగంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికి కూడా ఇక్కడి పరిసర ప్రాంతాల్లో నాగులు తిరుగుతూ భక్తుల కంటపడుతూ ఉంటాయి. ఈ స్వామిని దర్శించడం వలన చక్కని సంతానం లభిస్తుందని భక్తులు బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంటారు.


More Bhakti News