శ్రీరాముడు సేదతీరిన శిలల పవిత్రత
శ్రీరాఘవేంద్రస్వామి ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి అనునిత్యం మూలరాముడిని సేవిస్తూ ఉండేవాడు. శ్రీరాముడి సేవలో ... మధ్వమత వ్యాప్తిలో ఆయన జీవితకాలమంతా గడిచిపోతుంది. తాను ప్రహ్లాదుడిగా అవతరించినప్పుడు యజ్ఞయాగాదులు నిర్వహించిన 'మంచాల'(మంత్రాలయం)లోనే జీవసమాధి చెందాలని నిర్ణయించుకుంటాడు. ఆదోని నవాబు నుంచి మంచాల గ్రామాన్ని కానుకగా పొందుతాడు.
ఒక రోజున రాఘవేంద్రస్వామి తన శిష్యుడైన అప్పన్నను వెంటబెట్టుకుని ఒక కొండ ప్రదేశానికి తీసుకుని వెళతాడు. అక్కడ గల బండరాళ్లకు ఆయన భక్తి పూర్వకంగా నమస్కరిస్తాడు. స్వామి ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించడంతో, విషయమేవిటని అప్పన్న అడుగుతాడు. శ్రీరాముడు వనవాస కాలంలో ఆ ప్రదేశానికి వచ్చాడనీ, ఆయన పాదస్పర్శ కారణంగా ఆ శిలలు మహా పవిత్రయ్యాయని చెబుతాడు రాఘవేంద్రస్వామి.
శ్రీ రాముడు కూర్చున్న ఒక శిలా పీఠాన్ని కూడా ఆయన చూపిస్తాడు. ఆ శిలలతోనే తన బృందావన నిర్మాణం జరపాలని అంటాడు. దాంతో శిష్యులంతా కలిసి ఆ బండరాళ్లను ఒక్కొక్కటిగా బృందావన ప్రదేశానికి చేరుస్తారు. తన జీవసమాధి గురించి అందరికీ తెలియజేయవలసిన బాధ్యతను స్వామి అప్పన్నకి అప్పగిస్తాడు. ఆ సమయంలో ఆయనకి దూరంగా తాను వెళ్లనని చెబుతాడు అప్పన్న. తన పట్ల అప్పన్నకి గల ప్రేమానురాగాల గురించి ఎరిగిన స్వామి, కావాలనే అప్పన్నని దూరంగా పంపిస్తాడు.
రాఘవేంద్రస్వామి జీవసమాధి అనంతరం అక్కడికి చేరుకున్న అప్పన్న, తనని ఒంటరిని చేసి వెళ్లిన స్వామిని తలచుకుని కన్నీళ్ల పర్యంతమవుతడు. అంతకుముందే బృందావన ప్రవేశం చేసిన రాఘవేంద్రస్వామి ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు. తాను దూరమయ్యాననే చింతమానుకోమని చెబుతాడు. సమాధి మందిరం నుంచే తాను తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటానని అంటాడు. దాంతో అప్పన్నకి మనసు కుదుటపడి ఆ రోజు నుంచి స్వామిని విడువకుండా సేవిస్తూ తన శేష జీవితాన్ని తరింపజేసుకుంటాడు.