లక్ష్మీదేవిని ఏ పూలతో పూజించాలి ?

జీవితంలో ధనమనేది ప్రధానమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. ధనమే అభివృద్ధినీ ... ఆనందాన్ని ... సమాజంలో ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఆ ధనాన్ని సంపాదించడానికి అందరూ నానాకష్టాలు పడుతుంటారు. ఎవరు ఎంత కష్టపడినా, అందుకు తగిన ఫలితం లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే దక్కుతుంది.

ఈ కారణంగానే ఆ తల్లి కరుణా కటాక్షాలను కోరుతూ అందరూ ఆమెను పూజిస్తుంటారు. అయితే సాధారణ రోజుల్లో కంటే ఆ తల్లి అనుగ్రహం ... శ్రావణమాసంలో గల శుక్రవారాల్లో అధికంగా లభిస్తుందని చెప్పబడుతోంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' కావడం వలన ఈ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైనదని అంటారు. లక్ష్మీదేవికి శుక్రవారం ఇష్టమైన రోజు కనుక, ఈ మాసంలో శుక్రవారం రోజున ఆ తల్లిని ఆరాధించడం వలన త్వరగా అనుగ్రహిస్తుందని చెబుతారు.

సాధారణంగా .. సిరులను ప్రసాదించే శ్రీమహాలక్ష్మిని వివిధ రకాల పూలతో పూజించడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని తామరపూలతో పూజించాలని చెప్పబడుతోంది. తామరపువ్వు లక్ష్మీదేవి స్థానం కనుక, ఈ రోజున అమ్మవారిని తామరపూలతో పూజించి .. అందులోని కొన్ని పూలను ధనాన్ని భద్రపరిచే చోట వుంచడం వలన సంపదలు వృద్ధి చెందుతాయని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమంటే, దారిద్ర్యం ... దుఃఖం దూరంకావడమే. అందుకే శ్రావణ మాసపు శుక్రవారాల్లో అమ్మవారిని తామరపూలతో పూజించే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోకూడదు.


More Bhakti News