తులసి కోట తప్పనిసరిగా ఉండాలి
తులసి మొక్కను దేవలోక పారిజాతంగా పెద్దలు చెబుతుంటారు. అందువల్లనే ప్రతి ఇంటి ప్రాంగణంలోను తులసి కోట కనిపిస్తూ ఉంటుంది. తులసి మూలంలో బ్రహ్మదేవుడు .. మధ్యలో విష్ణువు .. చివరిలో శివుడు ఉంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తుంటారు. అందువలన తులసితో శ్రీమన్నారాయణుడిని పూజిస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడని అంటారు.
సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు తులసి కోటను నివాసంగా చేసుకుని ఉంటారని విశ్వసిస్తుంటారు. అందువల్లనే ఉదయాన్నే తులసి కోటను పూజించడం .. సాయంత్రం వేళలో తులసి కోటలో దీపం పెట్టడం చేస్తుంటారు. తులసిని పూజించడం వలన సకల సౌభాగ్యాలు చేకూరతాయని నమ్ముతుంటారు. తులసి మొక్కలపై నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవని అంటారు. ఇక తులసి మొక్క వున్న ఇంటిపై దుష్ట శక్తుల ప్రభావం పనిచేయదనే నమ్మకం కూడా వుంది. ఆధ్యాత్మిక పరమైన ఆనదాన్నిచ్చేదిగా .. ఆరోగ్యానికి రక్షణగా నిలిచేదిగా తులసికి తరతరాలుగా తరగని ప్రాధాన్యత వుంది.