హరి నామ స్మరణ ఫలం!

ప్రస్తుతం వున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఒక చోట స్థిమితంగా కూర్చుని జపం చేసే పరిస్థితులు చాలా తక్కువ. అలాంటివారికి భగవంతుడి నామ స్మరణ ఒక ఆయుధం లాంటిదేనని చెప్పాలి. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూనే భగవంతుడి నామాన్ని స్మరించుకోవచ్చు. బాగా వయసు మళ్లిన వాళ్లను గమనిస్తే, వాళ్లు అదే పనిగా "నారాయణ .. నారాయణ" అనుకుంటూ తమ పనులను చేసుకుంటూ ఉండటం కనిపిస్తుంది.

 భగవంతుడి నామాన్ని పలకాలనే ఉద్దేశంతోనే చాలామంది దేవుళ్ల నామాలను పేర్లుగా పెట్టుకునేవారు. ఆ పేరుతో పిలిచినా పుణ్యమేనని అనుకునే వాళ్లు. హరి నామాన్ని స్మరించడం వలన సమస్తమైన పాపాలు పటాపంచలై .. పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయురారోగ్యాలను పొందడమే కాకుండా, అనేక మార్లు వాళ్లు భూమిపై విష్ణు భక్తులుగా జన్మిస్తారట. ఇక వైష్ణవ క్షేత్రాలను దర్శించుకున్నప్పుడు హరి నామాన్ని స్మరించుకోవడం వలన లభించే ఫలితం, మరిన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటారు. అనునిత్యం హరి నామాన్ని స్మరించేవారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అందుకే అనునిత్యం శ్రీమన్నారాయణుడి నామాన్ని స్మరించాలి .. ఆయన వైభవాన్ని ఊహించుకుని అనుభూతిని చెందాలి .. ఆ తన్మయత్వంతో తరించాలి .        


More Bhakti News