శ్రీకృష్ణుడి లీలావిశేషాలను తలచుకుంటే చాలు!
కృష్ణ భగవానుడి బాల్యం .. ఆయన ఆటలు .. పాటలు .. లీలావిశేషాలు తలచుకుంటే మనసు ఆనందంతో పొంగిపోతుంది. దేవతలు.. మహర్షులు .. భక్తులు కృష్ణుడిని స్మరిస్తూ తరించారు. ధర్మ సంస్థాపనే లక్ష్యంగా శ్రీ కృష్ణుడు అవతరించాడు. అందువలన ధర్మం వైపే ఉంటూ .. ధర్మాన్ని అనుసరించినవారికి విజయం తప్పక లభిస్తుందని నిరూపించాడు. అలాంటి కృష్ణుడు వివిధ క్షేత్రాలలో .. ఆలయాలలో .. మందిరాలలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఎవరి భక్తికి తగినట్టుగా వాళ్లను అనుగ్రహిస్తున్నాడు.
పాండవులు ధర్మం తప్పక నడుచుకున్నారు గనుకనే కృష్ణుడు చివరివరకూ వాళ్లకి అండగా నిలిచాడు. ఎన్నో అవసరాల్లో .. ఆపదల్లో వాళ్లను ఆదుకున్నాడు. అలాంటి కృష్ణుడి నామాన్ని స్మరించడం వలన ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కృష్ణా .. కృష్ణా అని ఆ స్వామి నామస్మరణ చేస్తే చాలు, ఆ భక్తులకి సంబంధించిన అన్ని విషయాలను ఆయనే చూసుకుంటాడు. తన లీలావిశేషాలను తలచుకునే వారిపైన కరుణా కటాక్ష వీక్షణాలను కురిపిస్తాడు. ఆయురారోగ్యాలను .. సిరిసంపదలను ప్రసాదిస్తూ ఉంటాడు.