మానవత్వానికి మించినది లేదు
మహా భక్తులంతా కూడా ఈర్ష్యా .. అసూయ .. ద్వేషం .. స్వార్థ గుణాలకు దూరంగా తమ జీవితాన్ని కొనసాగించారు. దయ .. కరుణ .. జాలిని ప్రదర్శిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటి మహా భక్తులలో తుకారామ్ ఒకరుగా కనిపిస్తాడు. తుకారామ్ చేత ఏదో ఒక వ్యాపారం చేయించాలని ఆయన భార్య ఎంతగానో ప్రయత్నిస్తుంది. వ్యాపారమనేది ఎంతోకొంత లాభాపేక్షతోనే చేయాలి. అందుకు తుకారామ్ ఎంతమాత్రం ఒప్పుకోడు.
వ్యాపారం మొదలెట్టమంటూ భార్య తనకి ఇచ్చిన పైకాన్ని కూడా ఆయన దానధర్మాలకు ఉపయోగిస్తాడు. ఈ కారణంగా సర్వం కోల్పోయినా తుకారామ్ ఎంతమాత్రం బాధపడడు. అయితే తుకారామ్ భక్తికీ .. ఆయన చూపుతోన్న మానవత్వానికి ఆ పాండురంగడు మురిసిపోతాడు. ఆ కుటుంబానికి రక్షణగా నిలుస్తాడు. గరుడ వాహనాన్ని పంపించి .. శరీరంతోనే తుకారామ్ ను స్వర్గానికి తీసుకెళతాడు. మానవత్వాన్ని కలిగినవారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందనడానికి తుకారామ్ జీవితమే నిలువెత్తు నిదర్శనం.