సంతోషాల సందడి చేసే బతుకమ్మ

'బతుకమ్మ' పండుగ వస్తుందంటే చాలు పల్లెలు కొత్త అందాలను సంతరించుకుంటాయి. పట్టణాల్లోను సంతోషాల సందడి మొదలవుతుంది. 'బతుకమ్మ' పండుగ వస్తుందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రకృతిలోని ప్రతి పూల చెట్టు తనవంతు సేవగా ఎక్కువ పూలను అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ పువ్వుల సేకరణ కోసం ఆడపిల్లలంతా పోటీపడుతుండటం ఓ సరదా. అంతా కలిసి రకరకాల పూవులను సేకరిస్తూ .. అలా సేకరించడంలో సంతోషాన్ని పొందుతూ ఇంటికి చేరుకుంటారు.

 తొమ్మిది రకాల పూలతో .. తొమ్మిది రోజుల పాటు 'బతుకమ్మ'ను పేర్చడాన్ని 'నవవిధ భక్తి'కి నిదర్శనంగా చెబుతారు. అలాంటి భక్తితో .. ప్రేమతో అంతా కలిసి ఐకమత్యంతో బతుకమ్మను పేర్చి .. సమూహంగా పాటలు పాడతారు. ఆ పాటల్లో పండుగ పరమార్ధంతో పాటు ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయి. జానపద సాహిత్యానికి అద్దం పట్టే తెలుగు పండుగలలో 'బతుకమ్మ' ఒకటనే విషయం అర్థమవుతుంది. భాద్రపద బహుళ అమావాస్య రోజున 'ఎంగిలిపువ్వు బతుకమ్మ'తో మొదలుపెట్టి, ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుతారు. తొమ్మిది రోజులు ఈ పండుగను కనుల పండుగగా జరిపి "పోయి రావమ్మా గౌరమ్మ .. పోయి రావమ్మ బతుకమ్మ"అంటూ హారతులిచ్చి నీటిలో సాగనంపుతారు.  


More Bhakti News