విజయదశమి రోజున అమ్మవారి ఆరాధన
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ గల తొమ్మిది రోజులను 'శరన్నవరాత్రులు' అంటారు. ఆ తరువాత రోజైన 'దశమి'ని 'విజయ దశమి'గా చెబుతారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని నవవిధ రూపాలలో పూజిస్తూ వుంటారు గనుక, దేవీ నవరాత్రులని కూడా పిలుచుకుంటూ వుంటారు. ఒక్కో రోజున ఒక్కో రూపంతో దర్శనమిచ్చే అమ్మవారిని పూజించడం వలన, విశేషమైన ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధించడానికి అవకాశం లేనప్పుడు, మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిని .. దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని .. మహర్నవమి రోజున మహిషాసురమర్ధినిని పూజించడం మంచిది. ఇక 'దశమి' రోజు సాయంత్ర సమయానికే విజయము అను పేరు. ఈ కారణంగానే ఈ దశమికి 'విజయదశమి' అనే పేరు వచ్చింది. ఈ సమయంలో అమ్మవారిని 'అపరాజితా దేవి'గా ఆరాధించవలసి ఉంటుంది. బ్రహ్మదేవుడు .. విష్ణుమూర్తి .. శ్రీరామచంద్రుడు .. పాండవులు విజయదశమి రోజున అమ్మవారిని పూజించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన, ఆయురారోగ్యాలు .. విజయాలు .. సంపదలు చేకూరతాయని స్పష్టం చేస్తున్నాయి.