ప్రేమ స్వరూపుడు సాయినాథుడు
శిరిడీ సాయిబాబాను ఎంతో మంది భక్తులు అనునిత్యం ఆరాధిస్తూ వుంటారు. ఆయన లీలావిశేషాలను భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి శిరిడీ సాయిబాబా జీవితాన్ని పరిశీలిస్తే .. ఆయన ఎంతటి ప్రేమ స్వరూపుడో అర్థమవుతుంది. ఎంతటి కరుణాసాగరుడో స్పష్టమవుతుంది.
సాయి తనకి లభించిన ఆహార పదార్థాలను ముందుగా కుక్కలకు తినిపించేవాడు. అలాగే పక్షులకు కూడా ఆహారాన్ని అందించేవాడు. వాటికి దాహమైతే తాగడానికి చిన్న నీటి గుంటను కూడా సాయి ఏర్పాటు చేశాడు. ఇక తన కోసం ఎవరైనా భక్తులు ఏవైనా ఆహార పదార్థాలు తీసుకువస్తే, అక్కడున్న వాళ్లందరికీ వాటిని పంచి .. మిగిలిన దానినే తాను స్వీకరించేవాడు. తనచుట్టూ వున్న వాళ్లందరితో కలిసి భోజనం చేయడానికి సాయి ఎంతో ఆసక్తిని చూపేవాడు. ఇతరుల ఆకలి తీర్చడంలో .. ఆపదల నుంచి వాళ్లను బయటపడేయడంలోనే ఆయన ఎంతో ఆనందాన్ని పొందేవాడు. అందుకే సాయి తత్త్వం .. ప్రేమ తత్త్వమని భక్తులు చెప్పుకుంటూ వుంటారు .. అనునిత్యం ఆయన సేవలో తరిస్తుంటారు.