దుఃఖాన్ని దూరం చేసే సంతోషిమాత వ్రతం
జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ సంతోషంగా వుండాలని కోరుకుంటారు. అలాంటి సంతోషాన్ని అందించే తల్లి సంతోషిమాతగా చెబుతారు. విఘ్నేశ్వరుడి కూతురైన ఈ అమ్మావారిని సంతోషానికి అధిష్టాన దేవతగా కొలుస్తుంటారు. తమ కుటుంబం సంతోషంగా వుండాలని ఆ తల్లిని ఆరాధిస్తూ వుంటారు .. ఎల్లప్పుడూ తమని అనుగ్రహించమంటూ వ్రతం చేసుకుంటూ వుంటారు. చైత్ర .. వైశాఖ .. శ్రావణ .. భాద్రపద .. ఆశ్వీయుజ .. కార్తీక .. మార్గశిర .. మాఘ .. ఫాల్గుణ మాసాల్లో సంతోషిమాత వ్రతం చేయడం వలన విశేషమైన ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఈ వ్రతాన్ని శుక్రవారం మాత్రమే చేయాలి. ఎన్నివారాలు చేయాలనేది ముందుగానే నిర్ణయించుకుని, అన్ని వారాల పాటు నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున 'పులుపు' తినకూడదనే నియమం వుంది. ఈ వ్రతాన్ని అంకిత భావంతో ఆచరించడం వలన, అనారోగ్యాలు .. ఆర్ధిక పరమైన ఇబ్బందులు .. ఆపదలు తొలగిపోతాయనీ, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరి సంతోషాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.