సీతారామలక్ష్మణులు నడయాడిన చిత్రకూటం

సీతారాములు నడయాడిన పరమ పవిత్రమైన శ్రీ రామ క్షేత్రాలలో 'చిత్రకూటం' ఒకటిగా కనిపిస్తుంది. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు తిరుగాడిన పుణ్యస్థలి ఇది. సీతారాములకు ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో ఇష్టమని చెబుతుంటారు. ఉత్తరప్రదేశ్ లో 'మందాకిని' నదీ తీరంలో గల 'చిత్రకూటం' సీతారాముల కాలం నాటి ఆనవాళ్లను మన కనుల ముందుంచుతూ, అనిర్వచనీయమైన అనుభూతికి గురిచేస్తూ ఉంటుంది.

 ఇక్కడి రామ్ ఘాట్ .. జానకీ కుండ్ .. హనుమాన్ ధార .. సతీ అనసూయ ఆలయం దర్శించదగినవి. రామ్ ఘాట్ .. జానకీ కుండ్ ఎంతో పవిత్రమైనవిగా .. ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. చిత్రకూటానికి సమీపంలో గల అనసూయ దేవి ఆలయ దర్శనం కూడా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక హనుమాన్ ధార చూడదగినదనే చెప్పాలి. హనుమంతుడు 'లంకా దహనం' చేసి నేరుగా ఈ ప్రదేశానికి చేరుకోగా, కాలిన గాయాల నుంచి ఆయనకి ఉపశమనాన్ని కలిగించడానికి శ్రీరాముడు ఈ నీటి 'ధార'ను సృష్టించాడని అంటారు. ఇలా చిత్రకూటం రామాయణ కాలం నాటి రమణీయ దృశ్యాలను కనులముందుంచుతూ ఉంటుంది.     


More Bhakti News