లక్ష్మీదేవికి ఆహ్వానం పలికే రోజే దీపావళి

జీవితంలో జ్ఞానం చాలా అవసరమైనది .. ముఖ్యమైనది కూడా. జ్ఞానమే జీవితాన్ని సక్రమమైన మార్గంలో .. అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. అలాంటి జ్ఞానం  .. దీపాన్ని వెలిగించడం వలన కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి స్థిర నివాసం చేసే ప్రదేశాలలో దీపం ఒకటి. అందుకే దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా చెబుతుంటారు. అలాంటి దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీదేవి జ్ఞానంతో పాటు సంపదలను ప్రసాదిస్తుంది.

 దీపావళి .. అంటే దీపాల వరుస అని అర్థం. దీప మాలికలతో ఈ రోజున లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. సాధారణంగా పగలంతా ఉపవాసం ఉండి .. సాయంత్రం వేళ లక్ష్మీదేవి పూజ చేస్తుంటారు. ఆ సమయంలో భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి .. అన్ని వీధులలోను సంచరిస్తూ ఉంటుంది. ద్వారానికి తోరణాలతో .. గడపకి పసుపు కుంకుమలతో .. దీపమాలికలతో  ఏ ఇల్లు మంగళకరంగా అలంకరించబడి ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి తన కళను ఉంచుతుంది. లక్ష్మీదేవికి ఆహ్వానం పలికిన తరువాత ఆ రోజు రాత్రి ఇంట్లోని చెత్తను (జ్యేష్టా లక్ష్మి)ని బయటికి పంపించేయాలి. అప్పుడు లక్ష్మీ దేవి ఆ ఇంట స్థిర నివాసం చేస్తుంది. ఈ రోజు రాత్రి దీపాలు వెలిగించడం లక్ష్మీదేవికి స్వాగతం పలకడమైతే, టపాసులు కాల్చడం లోని అంతరార్థం .. జ్యేష్టాలక్ష్మిని సాగనంపడమేననేది పండితుల మాట.    


More Bhakti News