శాక సప్తమి రోజున లక్ష్మీదేవి ఆరాధన ఫలితం
కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసిన పూజలు .. వ్రతాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆథ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాసంలో జరుపుకునే వ్రతాలలో 'శాక సప్తమి వ్రతం' ఒకటి. కార్తీక శుక్ల సప్తమి రోజున 'శాక సప్తమి' వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఈ రోజున పూజా మందిరంలో లక్ష్మీదేవి ప్రతిమనుగానీ .. చిత్రపటాన్ని గానీ ఏర్పాటు చేసుకోవాలి.
పూజా మందిరాన్ని పూల మాలికలతో అలంకరించి .. అత్యంత భక్తి శ్రద్ధలతో షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారి పూజలో తామర పూలను .. పచ్చి కూరగాయలను ఉపయోగించవలసి ఉంటుంది. పచ్చి కూరగాయలనే నైవేద్యంగా సమర్పించి .. వాటినే ఆహారంగా తీసుకోవాలి. ఆ రోజున సాయంత్రం ముత్తయిదువులను ఆహ్వానించి, వాళ్లకి తాంబూలాలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా కార్తీక శుక్ల సప్తమి రోజున 'శాక సప్తమి' వ్రతాన్ని ఆచరించడం వలన, జీవితంలో ఆహారానికి ఎలాంటి లోటు రాదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.