కార్తీకంలో వైకుంఠ చతుర్దశి ప్రత్యేకత

శివకేశవులకు భేదం లేదని పురాణాలు చెబుతున్నాయి. శివుడిని పూజించడం వలన విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడనీ, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన శివానుగ్రహం కూడా లభిస్తుందనేది మహర్షుల మాట. అందుకు తగినట్టుగానే చాలా శైవ క్షేత్రాలలో విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. ఇక వైష్ణవ క్షేత్రాలలో శివుడు క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. అలాంటి శివ కేశవులకు కార్తీకమాసం పరమ ప్రీతికరమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ కార్తీకమాసంలోని అన్ని రోజులు ఆధ్యాత్మిక పరమైన ప్రత్యేకతను సంతరించుకుని, పుణ్యఫలాలను అందిస్తూ ఉంటాయి. అలాంటి పవిత్రమైన రోజుగా 'వైకుంఠ చతుర్దశి' కనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు వైకుంఠాన్ని వదిలి .. కాశీ వెళ్లి ఈ రోజున శివుడిని పూజిస్తాడని కథనం. ఇంతటి విశిష్టమైన ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించుకోవడం, శివాలయాలలో అభిషేకాలు చేయించడం జన్మజన్మలకి అవసరమైన పుణ్య ఫలాలను తెచ్చిపెడుతుంది. ఈ రోజున రాగి ప్రమిదలో గానీ  .. ఇత్తడి ప్రమిదలో గాని దీపం వెలిగించి పండితుడికి దానం ఇవ్వడం వలన విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం.      


More Bhakti News