పరశురామ జయంతి .. ఆయన నామ స్మరణ ఫలితం
అవతార పురుషుడైన పరశురాముడు .. రేణుకా దేవి .. జమదగ్నిల కుమారుడు. మహా పరాక్రమవంతుడైన పరశురాముడు తన తల్లిదండ్రులతో కలిసి ఆశ్రమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఓ సారి ఆయన ఆశ్రమంలో లేనప్పుడు హయహయుడనే రాజు .. జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వస్తాడు. కామధేనువు కోసం జమదగ్ని మహర్షిని వధించి వెళతాడు. విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహోదగ్రుడవుతాడు. క్షత్రియ జాతినంతా సమూలంగా నాశనం చేస్తానని ఆ సమయంలోనే ప్రతిజ్ఞ చేస్తాడు.
భృగు మహర్షి తన మంత్ర జలంతో జమదగ్ని మహర్షిని బ్రతికించినప్పటికీ, పరశురాముడు తాను చేసిన శపథం ప్రకారం క్షత్రియులపై 21 మార్లు దండెత్తి వాళ్లను సంహరిస్తాడు. ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకుగాను ఆయన అనేక పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, శివలింగ ప్రతిష్ఠలు చేస్తూ వెళ్లాడు. ఈ కారణంగానే చాలా పుణ్య క్షేత్రాల్లో పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు దర్శనమిస్తుంటాయి. అలాంటి పరశురాముడిని ఆయన జయంతి రోజున స్మరించుకోవడం వలన, తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.