ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆరాధన
సూర్యభగవానుడు ప్రతి నెలలో ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు .. దీనినే సంక్రమణం అంటారు. సూర్యదేవుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడానికే 'ధనుస్సంక్రమణం' అని పేరు. ధనుస్సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకూ .. అంటే సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకూ గల కాలాన్ని 'ధనుర్మాసం'గా చెబుతారు. వైష్ణవ సంప్రదాయాలలో ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత వుంది .. మరెంతో విశిష్టత వుంది.
ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి .. స్నానం చేసి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. వైష్ణవ ఆలయాలలో విష్ణు భక్తురాలైన గోదాదేవి రచించి గానం చేసిన 'తిరుప్పావై'ని గానం చేస్తారు. తన మధురమైన గానంతో 'తిరుప్పావై'ని గానం చేసి .. సాక్షాత్తు రంగనాథస్వామిని ఆమె భర్తగా పొందిన సంగతి తెలిసిందే. వైష్ణవ ఆలయాలలో స్వామిని దర్శించుకుని .. అక్కడి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. ఈ మాసమంతా కూడా విష్ణుమూర్తిని పూజించడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. మనసును ఆ స్వామికి అర్పించి ఆరాధించడం వలన, విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.