వైకుంఠ ప్రాప్తిని కలిగించే ఉత్పత్తి ఏకాదశి ఆరాధన
ప్రతి సంవత్సరం ప్రతి నెలలో శుక్ల పక్షంలో ఒకటి .. కృష్ణ (బహుళ) పక్షంలో ఒకటి .. రెండు ఏకాదశులు వస్తాయి. అలా ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులతో ప్రతి ఏకాదశి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ప్రతి ఏకాదశి కూడా శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఏకాదశి రోజున ఆ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలనీ .. అంకితభావంతో సేవించాలని అంటున్నాయి.
అలా మార్గశిర శుద్ధ ఏకాదశి 'ధృవైకాదశి'గా చెప్పబడితే .. మార్గశిర బహుళ ఏకాదశిని 'ఉత్పత్తి ఏకాదశి'గా పిలుస్తారు. దీనినే 'సఫలై ఏకాదశి' అని కూడా అంటారు. పూర్వం మురాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి శరీరం నుంచి 'ఏకాదశి' కన్య ఆవిర్భవించింది. విష్ణుమూర్తి శరీరం నుంచి ఏకాదశి కన్య ఉద్భవించిన కారణంగా 'ఉత్పత్తి ఏకాదశి' అనే పేరు వచ్చింది. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి .. శ్రీమహా విష్ణువును ఆరాధించాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన జన్మజన్మల పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందనేది మహర్షుల మాట.