శని త్రయోదశి రోజున శివార్చన
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలనే అంతా కోరుకుంటారు. ఉన్నంతలో మనశ్శాంతిగా ఉండాలని భావిస్తారు. అయితే శని దోషం కారణంగా అవన్నీ కూడా తలక్రిందులు అవుతాయి. ఎన్నో ఆటంకాలు .. ఇబ్బందులు .. కష్టాలు పలకరిస్తాయి .. అవమానాలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం ఎంతటివారికైనా చాలా కష్టమవుతుంది. అందువల్లనే శని దేవుడిని శాంతింపజేసి .. ఆ దోష ప్రభావం నుంచి బయటపడటానికి అంతా ప్రయత్నిస్తుంటారు. అలాంటివారికి శని త్రయోదశి ఒక మంచి మార్గమని చెప్పవచ్చు.
శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేయవలసి ఉంటుంది. ఆ రోజున నువ్వులు .. నువ్వుల నూనె .. నల్లని వస్త్రం దానం చేయవలసి ఉంటుంది. ఇక శని త్రయోదశి రోజున శివార్చన చేయకుండగా చేసే శని పూజ ఫలించదని అంటారు. అందువలన ఈ రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించాలి. ఈ విధంగా చేయడం వలన శనిదేవుడు శాంతిస్తాడు .. ఆయన శాంతిస్తే అనుగ్రహం లభిస్తుంది. శని దేవుడి అనుగ్రహం కారణంగా శని దోష ప్రభావం తగ్గుతూ వెళుతుంది. అందువలన శని త్రయోదశి రోజున శివుడిని .. శని దేవుడిని పూజించడం మరిచిపోకూడదు.