అనఘాష్టమి వ్రత నియమాలు .. ఫలితాలు
త్రిమూర్తి స్వరూపుడిగా .. ఙ్ఞాన ప్రదాతగా దత్తాత్రేయుడు చెప్పబడుతున్నాడు. అలాంటి దత్తాత్రేయుడు .. అనఘుడుగా పిలవబడుతున్నాడు .. ఆయన భార్యయే అనఘాదేవి. అష్టసిద్ధులు వీరి సంతానంగా చెప్పబడుతున్నారు. అలాంటి అనఘాదేవిని 'మార్గశిర బహుళ అష్టమి' రోజున వ్రత విధానం ద్వారా పూజించడం విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దత్తాత్రేయస్వామి .. అనఘాదేవి చిత్రపటం పూజా మందిరంలో ఉండేలా చూసుకోవాలి.
ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి మధ్యాహ్నం 12 గంటల లోపు వ్రతం పూర్తయ్యేలా చూసుకోవాలి. వ్రతం పూర్తయిన ఆ మధ్యాహ్నం నిద్రించకూడదు. వ్రతం చేసిన తరువాత ఐదుగురు పుణ్య స్త్రీలకు అనఘాష్టమి వ్రత పుస్తకాలను ఇవ్వాలి. వ్రతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుని .. ప్రశాంతంగా .. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా చేయడం వలన, మనసులోని ధర్మ బద్ధమైన కోరికలు నెరవేరతాయి. కష్టాల నుంచి .. నష్టాల నుంచి బయటపడటం జరుగుతుంది. వివాదాలు .. ఆటంకాలు దూరమవుతాయి. ఆయురారోగ్యాలు లభించడంతో పాటు సంతాన సౌభాగ్యాలకు రక్షణ కలుగుతుంది. అందువలన ఈ రోజున అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించడం మరిచిపోకూడదు.