శివ పూజలో శంఖ జలాన్ని అందుకే ఉపయోగించరు

దేవాలయాలలో దేవతా మూర్తుల సన్నిధిలో ఉంటూ శంఖం కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలోను శంఖా నాదం చేస్తూ వుంటారు. శంఖం శబ్దాన్ని మంగళకరంగా భావిస్తారు .. శంఖంలో పోసినదే తీర్థం అవుతుంది .. శంఖ జలంతోనే భగవంతుడికి అభిషేకం చేస్తారు. దీనిని బట్టి శంఖం ఎంతటి పవిత్రమైనదో అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి సముద్రంలో నుంచి ఆవిర్భవించింది కనుక, సముద్రంలో లభించే శంఖాలు ఆమె తోబుట్టువులని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన శంఖం వున్న ప్రదేశాల్లో లక్ష్మీదేవి కూడా ఉంటుందని చెబుతారు.

 శంఖా నాదం విజయాన్ని సూచిస్తుంది.  అందువలన శ్రీ కృష్ణుడు 'పాంచజన్యం' .. అర్జునుడు 'దేవదత్తం' .. భీమ సేనుడు పౌండ్రక .. ధర్మరాజు 'అనంతలి' .. నకులుడు 'సంఘోష' .. సహదేవుడు 'మణిపుష్పకం' పేరుగల శంఖాలను ఉపయోగించారు. వైష్ణవ దేవతలకు శంఖ జలంతో అభిషేకం జరుపుతారు. కానీ శివలింగానికి మాత్రం శంఖ జలంతో అభిషేకం చేయకూడదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమశివుడు 'శంఖ చూడుడు' అనే రాక్షసుడిని సంహరించి సముద్రంలోకి విసిరేశాడు. అతని శరీరం నుంచే శంఖాలు పుట్టాయని అంటారు. ఈ కారణంగానే శివ పూజలో  శంఖ జలాన్ని ఉపయోగించరు.           


More Bhakti News