ఇలా కూడా కుజ దోషం తొలగిపోతుంది
నవగ్రహాలలో మంగళ (కుజ) గ్రహం కూడా తనదైన ప్రత్యేకతను .. ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అందువలన కుజ గ్రహ అనుగ్రహం కూడా చాలా అవసరం. సాధారణంగా కుజ దోషం ఉందనగానే చాలా మంది కంగారు పడిపోతూ వుంటారు. కుజ దోషం కారణంగా వివాహం విషయంలో ఆలస్యం కావడం .. వివాహమైన తరువాత దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎదురుకావడం జరుగుతూ ఉంటుంది.
జీవితంలో వివాహమనేది చాలా కీలకమైనది. ఈ విషయంలో కుజ దోషం కారణంగా సమస్యలు ఎదురుకావడం ఇబ్బందిని కలిగించే విషయం. కుజ దోషం వున్నవారు ఆయనని శాంతింపజేసే మార్గాలు వున్నాయి. ఆయన ప్రీతి చెందేలా చేయడం వలన ఆయనని శాంతింపజేయవచ్చు. ప్రతి మంగళవారం రోజున కుజుడిని 'పారిజాత పుష్పాలు'తో పూజించవలసి ఉంటుంది. ఈ విధంగా పారిజాత పుష్పాలతో కుజుడిని పూజించడం వలన, కుజుడు శాంతించి .. దోష ప్రభావాన్ని తగ్గిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.