లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా లభిస్తుంది
జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు నిరాశా నిస్పృహలను కలిగిస్తూ ఉంటాయి. అవసరాలకి సరిపోయేంత సంపాదన ఉన్నప్పటికీ, ఏదో ఒక ఆపదో .. అనారోగ్యమో వచ్చి అది ఖర్చు అవుతూ ఉంటుంది. ఆత్మాభిమానం పక్కన పెట్టేసి .. ఎవరినో ఒకరిని అప్పు అడగవలసి వస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తమయందు లేదని అప్పుడే అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఆ తల్లికి నచ్చేలా నడచుకోవలసి ఉంటుంది.
ఇంట్లోని వారంతా ఉదయాన్నే నిద్రలేచి .. స్నానం చేసి పూజా మందిరంలో దీపారాధన చేయాలి. పూజా మందిరాన్ని పూలతో అలంకరించి ఆరాధన చేయాలి. ఆరోగ్యంగా వున్న వాళ్లంతా బద్ధకాన్ని వదిలిపెట్టి శ్రమించవలసి ఉంటుంది. ఇక ఇంట్లోని వాళ్లంతా కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఏ ఇల్లయితే పరిశుభ్రంగా .. మంగళప్రదంగా .. ప్రశాంతంగా ఉంటుందో, అక్కడ అమ్మవారు ఉండటానికి ఇష్టపడుతుంది. అహంభావాన్ని వదిలేసి .. అందరిపట్ల ఆత్మీయభావనతో ఎవరైతే వుంటారో అలాంటివారి పట్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.