కోటి తీర్థం .. జటా తీర్థం ప్రత్యేకత
జీవితంలో ఒక్కసారైనా రామేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. రామేశ్వర దర్శనం వలన .. అక్కడి పుణ్యతీర్థాలలో స్నానమాచరించడం వలన సమస్త పాపాలు నశించి .. పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. రామేశ్వరం లోని 22 పుణ్య తీర్థాలలో 'కోటి తీర్థం' .. 'జటా తీర్థం' తమ ప్రత్యేకతలను చాటుకుంటూ ఉంటాయి.
'కోటి తీర్థం'లో శ్రీకృష్ణుడు స్నానమాచరించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'కంసుడు'ను సంహరించిన తరువాత ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు ఈ తీర్థంలో స్నానం చేశాడట. ఇక 'జటా తీర్థం'లో శ్రీరాముడు స్నానమాచరించాడట. రావణుడిని సంహరించిన తరువాత, ఆ పాపం నుంచి విముక్తిని పొందడానికిగాను శ్రీరాముడు ఈ తీర్థంలో తన జటలను తడుపుతూ స్నానం చేశాడట. అందువల్లనే ఈ తీర్థానికి 'జటా తీర్థం' అనే పేరు వచ్చిందని అంటారు. ఇతర తీర్థాలకి సంబంధించి కూడా ఇక్కడ అనేక విశేషాలు వినిపిస్తూ ఉంటాయి.