సర్వ దేవతా స్వరూపుడు దత్తాత్రేయుడు
త్రిమూర్తుల వరం చేత .. త్రిమూర్తుల అంశచే అత్రి మహర్షి .. అనసూయ దంపతులకు దత్తాత్రేయస్వామి జన్మించాడు. స్వామివారు ధరించిన ఆయుధాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి. దత్తాత్రేయస్వామి మహాజ్ఞాని .. ఆయన దేవతలకు .. మహర్షులకు జ్ఞానబోధ చేసినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దత్తాత్రేయుడు తన భక్తులను పరీక్షిస్తూ .. ఆ పరీక్షలో నెగ్గినవారిని అనుగ్రహిస్తూ వుంటాడు.
ఆపదలో వున్నవారు ఏడుమార్లు పిలిస్తే చాలు .. ఏడోసారి ఆయన భక్తుల చెంత ఉంటాడని విశ్వసిస్తుంటారు. తనని నమ్మిన భక్తులను ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. దత్తాత్రేయ స్వామి సర్వదేవతా స్వరూపుడని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన, సమస్త దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన వలన ఆయురారోగ్యాలు .. జ్ఞానం లభిస్తుంది. 'దత్తాత్రేయ వజ్రకవచం' అనునిత్యం పఠించడం వలన ఆ స్వామి రక్షణగా నిలుస్తాడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.