పళ్లాలమ్మ తల్లి అలా ఆవిర్భవించిందట!
గోదావరి జిల్లాల్లో 'పళ్లాలమ్మ తల్లి' క్షేత్రం గురించి తెలియని వారుండరు. అంతగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. తూర్పుగోదావరి జిల్లా .. కొత్తపేట మండలం 'వానపల్లి'లో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారనీ .. అందువల్లనే 'వానరపల్లి'గా పిలవబడేదని చెబుతారు. కాలక్రమంలో ఆ పేరు కాస్త 'వానపల్లి'గా మారిపోయిందని అంటారు.
ఇక సీతారాములు ఈ ప్రాంతానికి వచ్చారనీ .. సీతమ్మ తల్లి వల్లనే 'పళ్లాలమ్మ తల్లి' ఇక్కడ ఆవిర్భవించిందని చెబుతారు. ఈ ప్రదేశానికి వచ్చిన సీతమ్మ తల్లి .. ప్రకృతి మాతను పూజించిందట. ఆ తల్లి సీతమ్మ కోసం పువ్వులతో .. పండ్లతో ప్రత్యక్షమైందట. సీతమ్మ తల్లి ఎదుట ప్రకృతి మాతగా ప్రత్యక్షమై, పువ్వులను - పండ్లను అందించిన అమ్మవారే 'పళ్లాలమ్మ'గా ఇక్కడ ఆవిర్భవించిందని కథనం. ఆనాటి నుంచి అమ్మవారు భక్తులచే పూజలు అందుకుంటూ .. వారి ధర్మ బద్ధమైన కోరికలను నెరవేరుస్తోంది. ఈ ప్రాంతంలోని చాలామంది ఈ అమ్మవారిని తమ ఇష్ట దైవంగా భావించి ఆరాధిస్తూ వుంటారు .. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.