తులసి పూజా ఫలితం
ఆధ్యాత్మిక చింతన కలిగిన చాలామంది ఇంటి ఆవరణలలో 'తులసి కోట' కనిపిస్తూ ఉంటుంది. తులసి మొక్కలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే సమస్త దేవతలు తులసి కోటలో కొలువై ఉంటారని అంటున్నాయి. సమస్త పుణ్యతీర్థాలు తులసిని ఆశ్రయించి వుంటాయని చెబుతున్నాయి. ప్రతిరోజు తులసి కోట ముందు ఆవు పేడతో అలికి ..ముగ్గులు పెట్టవలసి ఉంటుంది. స్నానం చేసిన తరువాత తులసికి నీళ్లుపోసి .. ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది.
అలాగే సంధ్యా సమయంలోను తులసి కోటలో దీపం పెట్టవలసి ఉంటుంది. తులసి మొక్కకు నమస్కరించి .. స్వామివారి పూజ కోసమే నీ దళాలు కోస్తున్నాను అని అనుమతిని కోరి దళాలు కోయవలసి ఉంటుంది. అలా కోసిన తులసి దళాలతో విష్ణుమూర్తిని ఆరాధించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయనేది ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆది .. మంగళ .. గురు .. శుక్రవారాల్లో తులసిని కోయకూడదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.