శ్రీరాముడు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాడు
ప్రాచీన కాలానికి చెందిన పుణ్య క్షేత్రాలను దర్శించినప్పుడు, చాలా చోట్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు ఆ పాపం నుంచి విముక్తిని పొందడం కోసం ఆయా ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణాలు చెబుతూ ఉంటాయి. అలా శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమిగా .. రామాయణ కాలంతో ముడిపడిన పరమ పవిత్రమైన క్షేత్రంగా 'రామేశ్వరం' కనిపిస్తుంది.
రామేశ్వరంలోని తీర్థాలు సమస్త పాపాలను తొలగించి .. పుణ్య ఫలాలను అందించేవిగా కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనవిగా 'గంధమాదన పర్వతం' .. 'ధనుష్కోటి' కనిపిస్తాయి. రావణుడిని సంహరించిన అనంతరం శ్రీరాముడు ఈ 'గంధమాదన పర్వతం' పైకి వచ్చి, కొంతసేపు ధ్యానం చేశాడట .. ఆ తరువాత శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు స్థలపురాణం. అందుకే ఇక్కడి శివుడిని రామలింగేశ్వరుడు అంటారు. ఇక రామచంద్రుడిని విభీషణుడు శరణు వేడినది .. విభీషణుడికి తాత్కాలిక పట్టాభిషేకం జరిగింది 'ధనుష్కోటి'లోనేనని అంటారు. ఇక్కడ చేసిన దానానికి అనేక రెట్ల ఫలితం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం .