భోగి పండుగ ప్రత్యేకత ఇదే

'భోగి' అంటే 'భోగము' .. 'తొలినాడు' అనే అర్థాలు వున్నాయి. సంక్రాంతి పండుగకి ముందురోజుగా 'భోగి' పండుగను జరుపుతూ వుంటారు. 'భోగి' రోజున తెల్లవారు జామునే ఇంటి ముందు .. పనికిరాని వస్తువులతో 'భోగి మంటలు' వేసి .. ఆ తరువాత తల స్నానాలు చేస్తారు. ఈ విధంగా చేయడం వలన దుష్ట పీడలు తొలగిపోతాయని భావిస్తుంటారు. ఆ తరువాత వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టేసి .. గొబ్బెళ్లు పెడతారు. బంతి రేకులతో గొబ్బెమ్మలను పూజిస్తూ .. గొబ్బి పాటలు పాడతారు.

 గొబ్బెళ్లను గోపికలకు ప్రతీకలుగా భావిస్తుంటారు. అందువలన గొబ్బెళ్లను ఆరాధిస్తూ పాటలు పడటం వలన తగిన వరుడితో .. సకాలంలో వివాహం అవుతుందని అంటారు. ఇక 'భోగి'నాటి సాయంత్రం పేరంటాళ్లను ఆహ్వానించి, రేగుపండ్లు .. చెరుకు ముక్కలు .. చిల్లర నాణాలను కలిపి చిన్నపిల్లలకు 'భోగి పండ్లు'పోస్తారు. ఈ విధంగా చేయడం వలన పిల్లలకి దృష్టి దోషాలు తొలగిపోతాయని అంటారు. 'భోగి' రోజునే గోదాదేవి .. శ్రీరంగనాథుడిని భర్తగా పొందింది. అందువలన ఈ రోజున వైష్ణవ ఆలయాలలో శ్రీరంగనాథుడికి గోదాదేవికి వైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడం వలన, సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.  


More Bhakti News