పాపాలను తొలగించే త్రివేణి ఘాట్
అత్యంత ప్రాచీనమైన .. పవిత్రమైన .. ప్రశాంతమైన పుణ్య ధామాలలో ఒకటిగా 'ఋషీ కేష్' కనిపిస్తుంది. ఒకప్పుడు ఇది 'హృషీ కేష్' గా పిలవబడుతూ ఉండేదట .. కాలక్రమంలో 'ఋషీ కేష్' గా మారింది. ఆహ్లాదకరమైన ఈ పుణ్య ధామంలో రామ్ ఝాలా .. లక్ష్మణ్ ఝాలా .. ఋషీ కుండ్ .. రఘునాథ ఆలయం .. త్రివేణి ఘాట్ దర్శించదగినవి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదిస్తూ వుంటారు.
ఈ పుణ్యధామం నదీ సంగమ స్థానంగా దర్శనమిస్తూ ఉంటుంది. గంగ .. యమున .. సరస్వతి నదులు ఇక్కడ సంగమం చెందుతాయి కనుక, దీనిని 'త్రివేణి ఘాట్' అని పిలుస్తుంటారు. ఈ నదీ సంగమస్థానంలో స్నానం చేయడం వలన, సమస్త పాపాలు నశిస్తాయనేది భక్తుల విశ్వాసం. ఇక్కడి గంగా హారతిని దర్శించుకోవడం వలన, మోక్షం లభిస్తుందని భావిస్తారు. అందువలన ఈ గంగా హారతిని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటూ వుంటారు.