ఈ రోజున రామాయణం పఠించాలి
ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడవకుండగా ఎలా ముందుకు వెళ్లాలనేది శ్రీరామచంద్రుడు ఈ లోకానికి తెలియజేశాడు. భర్త అడుగుజాడల్లో భార్య ఎలా నడచుకోవాలనేది సీతమ్మవారు చాటిచెప్పింది. అందుకే అంతా మనసే మందిరంగా మలిచి ఆ దంపతులను పూజించుకుంటూ వుంటారు. ఇక 'శ్రీరామ నవమి' రోజున ప్రతి గ్రామంలోను అంతా అది తమ ఇంట్లో జరిగే పెళ్లి అన్నట్టుగా సంబరపడిపోతారు .. సందడి చేసేస్తారు. అంతగా సీతారాముల పట్ల ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తారు .. అంకితభావంతో ఆరాధిస్తారు.
భూమిని దున్నుతూ ఉండగా సీతమ్మ వారు పసికందుగా ఉంచబడిన పెట్టె .. నాగలి కర్రుకు తగిలి బయటపడుతుంది. అలా ఆ సీతమ్మ తల్లి నాగేటి చాలులో నుంచి బయటపడినది 'ఫాల్గుణ బహుళ అష్టమి' అని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజునే సీతమ్మవారి జన్మదినంగా చెబుతారు. ఈ రోజున ఆలయానికి వెళ్లి సీతారాములను దర్శించుకోవడం వలన .. అక్కడ కూర్చుని 'రామాయణం' చదువుకోవడం వలన అనంతమైన ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.