కాముని పున్నమి వెనుక కథ
దక్షయజ్ఞ సమయంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవి, ఆ తరువాత హిమవంతుని కూతురైన పార్వతిగా జన్మిస్తుంది. తపోదీక్షలో వున్న పరమశివుడికి పార్వతి సపర్యలు చేస్తూ ఉంటుంది. లోక కల్యాణం కోసం పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని జరిపించవలసిన అవసరం గురించి దేవతలు మన్మథుడిని ఆశ్రయిస్తారు. వారి కోరిక మేరకు సదాశివుడిని కామ వికారాలకు గురిచేయడం కోసం మన్మథుడు పూల బాణాలు వేస్తాడు. విషయాన్ని గ్రహించిన శంకరుడు, తన తపోదీక్షకు భంగం కలిగించిన మన్మథుడిని మూడవ నేత్రం తెరచి భస్మం చేస్తాడు.
దేవతల అభ్యర్థన మేరకు .. లోక కల్యాణం కొరకు తన భర్త ఆ విధంగా చేశాడంటూ 'రతీదేవి' కన్నీటి పర్యంతమవుతుంది. దాంతో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఒప్పించి, మన్మథుడు అశరీరంగా .. అదృశ్య రూపంతో వుండునట్టుగా 'రతీదేవి'కి మాంగల్య భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. మన్మథుడిని కాముడు అని అంటారు .. ఆయన సజీవుడైన రోజు ఫాల్గుణ పౌర్ణమి .. అందువల్లనే ఈ రోజును 'కాముని పున్నమి' అని అంటారు. స్త్రీలు .. పురుషులు ఈ రోజున సరదాగా .. సంతోషంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తారు. ఇక ఈ రోజున 'హోళిక' అనే రాక్షసి సంహరించబడటం వలన, 'హోలీ' పేరుతో సంబరం చేసుకోవడం జరుగుతుందనే మరో కథనం వినిపిస్తూ ఉంటుంది.