నవ నారసింహులు కొలువైన అహోబిలం
నరసింహస్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో .. మహిమాన్వితమైన క్షేత్రాల్లో 'అహోబిలం' ఒకటిగా కనిపిస్తుంది. హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత స్వామివారు ఇక్కడ కొలువైయ్యాడనీ .. 'చెంచులక్ష్మి' కథనం ఇక్కడే జరిగిందని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో నవ నారసింహులు దర్శనమిస్తూ ఉండటం విశేషం.
'జ్వాలా నరసింహుడు' .. 'అహోబిల నరసింహుడు' .. 'మాలోల నరసింహుడు' .. 'వరాహ నరసింహుడు' .. 'కారంజ నరసింహుడు' .. 'భార్గవ నరసింహుడు' .. 'యోగానంద నరసింహుడు' .. 'ఛత్రవట నరసింహుడు' .. ' పావన నరసింహుడు' ఇక్కడ దర్శనమిస్తూ వుంటారు. ఈ నవ నారసింహులను దర్శించుకోవడం వలన, సమస్త పాపాలు .. గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ప్రతి యేటా ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకూ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. బ్రహ్మోత్సవ వైభవంలో స్వామివారిని భక్తులు దర్శించి ధన్యులవుతుంటారు.