భీముని కొలను వెనుక కథ
పూర్వకాలంలో 'శ్రీ పర్వతం'గా పిలవబడిన శ్రీశైలం .. సిద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పర్వతాల్లో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయనేది ప్రాచీన గ్రంధాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో 'భీముని కొలను' దర్శనమిస్తుంది. కొండరాళ్ల సందుల గుండా నీటి ప్రవాహం పరుగులుతీస్తూ కొలనుగా ఏర్పడింది. ఈ కొలనుకు ఈ పేరు రావడం వెనుక ఒక కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.
పూర్వం 'లోమశ మహర్షి'తో కలిసి పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట. ఆ పరిసరాలు చూసివచ్చిన భీముడు .. ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. దాంతో లోమశ మహర్షి ఒక శిలను చూపించి దానిని పగులగొట్టమని చెప్పాడు. తన 'గద'తో ఆ శిలను భీముడు పగులగొట్టగానే నీటి ధారలు కిందికి దూకాయి. ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుంది. భీముడి కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి 'భీముని కొలను' అనే పేరు వచ్చింది. ఇక్కడే భీముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు .. అందువల్లనే ఇక్కడి శివలింగం .. 'భీమలింగం'గా నేటికీ పూజలు అందుకుంటోంది.