శయన శివమూర్తి దర్శన ఫలితం
సాధారణంగా ఏ శైవ క్షేత్రానికెళ్లినా పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. శివలింగం ఆయా వర్ణాల్లో దర్శనమిస్తూ ఉండటం, ఆయా క్షేత్రాల విశిష్టతగా చెబుతుంటారు. పరమశివుడు విగ్రహంగా మూర్తి రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాలు చాలా తక్కువ. ఇక ఆయన శయన భంగిమలో దర్శనమిచ్చే క్షేత్రాలు మరీ అరుదనే చెప్పాలి. అలా ఆ స్వామి శయన భంగిమలో దర్శనమిచ్చే క్షేత్రంగా 'సురటుపల్లి' కనిపిస్తుంది.
ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా 'నాగలాపురం' మండలం పరిథిలో దర్శనమిస్తుంది. శివుడు హాలాహలం మింగిన ఘట్టంతో ముడిపడిన ఈ క్షేత్రం, మహా మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ స్వామి దర్శనం చేసుకోవడం వలన ఆపదలు దరిచేరవని అనుభవపూర్వకంగా చెబుతారు. ఆపదలో వున్న వారు ఆ స్వామిని తలచుకున్నంతనే అందులో నుంచి బయటపడతారని అంటారు. ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకుని సీతారాములు .. ఆ తరువాత కాలంలో లవకుశులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారని స్థలపురాణం చెబుతోంది.