కాశీలో దర్శనమిచ్చే కేశవాదిత్యుడు
జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రం 'కాశీ' అనేది పెద్దల మాట. అలాంటి కాశీ క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనవిగా చెప్పబడే 12 సూర్యదేవాలయాలు దర్శనమిస్తాయి. ఇక్కడ ఒక్కో ఆలయంలోని సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి ఆలయాలలో 'కేశవాదిత్య ఆలయం' ఒకటిగా కనిపిస్తుంది.
పూర్వం కాశీ క్షేత్రానికి వచ్చిన శ్రీ మహావిష్ణువు .. అక్కడి విశ్వేశ్వరుడిని పూజిస్తూ ఉంటాడు. అది చూసిన సూర్యభగవానుడు .. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆ విధంగా శివుడిని ఆరాధించడం గురించి ప్రస్తావిస్తాడు. శివుడికంటే పూజనీయులు ముల్లోకాలలోను లేరనీ .. అలాంటి పరమశివుడిని అభిషేకించి ఆ జలాన్ని తలపై చల్లుకోవడం వలన, సమస్త తీర్థాలలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని శ్రీ మహావిష్ణువు చెబుతాడు. దాంతో సూర్యభగవానుడు ఈ ప్రదేశంలో శివుడిని ఆరాధిస్తూ ఇక్కడే కొలువయ్యాడు. కేశవుని సూచనమేరకు శివుడిని ఆరాధించిన ఆదిత్యుడు కనుక, ఇక్కడి ఆలయంలోని సూర్యభగవానుడు కేశవాదిత్యుడు అనే పేరుతో కొలవబడుతూ ఉంటాడు.