ప్రకృతి శోభకు ప్రతీకయే చైత్ర మాసం
చాంద్రమానంలో వచ్చే మొదటి మాసమే చైత్రమాసం. పౌర్ణమి రోజున చంద్రుడు 'చిత్త' నక్షత్రంలో ఉండటం వలన ఈ మాసానికి చైత్రమాసమని పేరు. చైత్ర మాసాన్నే వసంతమాసం .. మధుమాసం అని కూడా పిలుస్తుంటారు. ఋతువులలో మొదటిదిగా చెప్పుకునే వసంతఋతువు ఈ మాసంలోనే మొదలవుతుంది. చైత్ర మాసపు తొలిరోజు నుంచే 'శ్రీరామ నవరాత్రులు' మొదలవుతాయి. శిశిరంలో ఆకులు రాల్చే చెట్లన్నీ చైత్రంలో చిగురిస్తాయి. ఈ మాసంలో ప్రకృతి అంతా కొత్తదనాన్ని సంతరించుకుని పచ్చదనంతో కళకళలాడుతూ కనిపిస్తుంది.
చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే యుగారంభం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే దీనిని 'ఉగాది'గా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి .. కొత్తబట్టలు ధరించి .. భగవంతుడిని పూజించి .. ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఆ రోజు సాయంత్రం ఆలయానికి వెళ్లి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనాలి. చైత్ర మాసంలో 'దవనం'తో దేవతార్చన చేయడం వలన, అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక ఈ మాసంలో చేసే మంచినీటి దానం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి. చాలా మంది ఈ మాసం మొదలు వేసవి కాలం పూర్తయ్యేంత వరకూ 'చలివేంద్రాలు' ఏర్పాటు చేసి బాటసారుల దాహాన్ని తీర్చుతుంటారు.