శ్రీరాముడు సృష్టించిన హనుమాన్ ధార
వనవాస సమయంలో సీతారాములు నడయాడిన అనేక ప్రదేశాలు .. పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'చిత్రకూటం' ఒకటిగా కనిపిస్తుంది. సీతారాములు తమ 14 యేళ్ల వనవాస కాలంలో 11 యేళ్ల పాటు తిరుగాడిన ప్రదేశం ఇదేనని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం నచ్చడం వల్లనే సీతారాములు అంతకాలం పాటు ఇక్కడే ఉండిపోయారని .. ఇప్పటికీ ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నవాళ్లు అనుకుంటారు.
ఇక్కడి రామ్ ఘాట్ .. జానకీ కుండ్ .. అనసూయ మాత ఆలయం .. గుప్త గోదావరి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. సీతారాముల తిరుగాడిన ఆనవాళ్లకు సాక్షిగా నిలుస్తూ ఇక్కడ మందాకినీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక హనుమాన్ ధారను చూస్తే కలిగే అనుభూతే వేరు. ఆంజనేయుడు లంకా దహనం చేయడం వలన ఆయన తోకతో పాటు వంటిపై అక్కడక్కడ కాలిన గాయాలు అయ్యాయట . ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలిగించడం కోసం రాముడు .. ఈ నీటిధారను సృష్టించాడట. హనుమంతుడి కోసం సృష్టించిన ధార కావడం వలన దీనిని అంతా 'హనుమాన్ ధార' అని పిలుస్తూ వుంటారు.