రావణుడి అహంభావం .. ఆయనకి గల శాపాలు
లంకాధిపతి అయిన రావణుడు మహా పరాక్రమవంతుడు. తపోబలాన్ని కలిగిన రావణుడు వరాలనే కాదు .. ఎన్నో శాపాలను సైతం పొందుతాడు. ఈ శాపాలలో ఒకటి సీతమ్మవారికి రక్షణగా నిలిస్తే .. రావణుడికి గల మరో శాపం ఆయన ప్రాణాలనే హరించివేస్తుంది. ఒకసారి బ్రహ్మదేవుని కూతురైన 'పుంజికస్థల'ను రావణుడు అవమాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన బ్రహ్మదేవుడు ఉగ్రుడై .. ' అయిష్టతను చూపే స్త్రీని తాకడానికి ఎప్పుడు ప్రయత్నించినా, తక్షణమే నీ తల ముక్కలవుతుంది' అని శపిస్తాడు.
సీతమ్మవారిని తాకే సాహసాన్ని రావణుడు చేయలేకపోవడానికి ఈ శాపం ఒక కారణమైంది. దూరంనుంచే ఆమెకి చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోయేవాడు. ఇక ఒకసారి పరమశివుడి దర్శనార్థం రావణుడు కైలాసానికి వెళతాడు. ద్వారం దగ్గరే ఆయనను నందీశ్వరుడు అడ్డుకుని, ధ్యానంలో వున్న శివుడిని ప్రస్తుతం దర్శించుకోవడం కుదరదని చెబుతాడు. ఆ కోపంతో రావణుడు .. నందీశ్వరుడిని 'కోతి' అంటూ నానా మాటలు అంటాడు. దాంతో రావణుడి ప్రాణాలు పోవడానికి ఆ కోతులే సహకరిస్తాయనీ .. ఆ కోతుల కారణంగానే లంకా నగరం ధ్వంసం అవుతుందని శపిస్తాడు. ఆ తరువాత నందీశ్వరుడి శాపం ప్రకారం అలాగే జరుగుతుంది. ఇలా ఎంతోమంది శాపాలు రావణుడి మరణానికి కారణాలయ్యాయి.