అవే తన గురువులు .. వాటి నుంచి జ్ఞానాన్ని పొందాను
ఎంతోమంది మహర్షులకు .. మహారాజులకు .. దేవతలకు దత్తాత్రేయుడు జ్ఞానబోధ చేశాడు. సృష్టిలోని జీవరాశుల నుంచి జ్ఞానాన్ని గ్రహించమని చెప్పాడు. అందువలన తాను తేనెటీగ .. కొండచిలువ నుంచి జ్ఞానాన్ని గ్రహించినట్టుగా ఒక వ్యక్తి ప్రహ్లాదుడికి చెబుతాడు. ఒకసారి ప్రహ్లాదుడు ఒక ప్రదేశంలో పర్యటిస్తూ ఉండగా .. ఒక వ్యక్తి తారసపడతాడు. ఆయనలోని తేజస్సును చూసిన ప్రహ్లాదుడు .. వివరాలు అడుగుతాడు. ఆయన ఒక జ్ఞానిలా కనిపించడంతో .. ఆయన గురువును గురించి ప్రశ్నిస్తాడు.
అప్పుడాయన తేనెటీగ .. కొండచిలువ తన గురువులని చెబుతాడు. తేనెటీగ తేనెపట్టు పెట్టడమే తప్ప తేనెను అనుభవించలేదు .. అందువలన అది పరులపాలవుతుంది. అలాగే ధనాన్ని కూడబెట్టినవాడు కూడా దానిని అనుభవించలేడు. అందువలన ధనానికి ఆశపడటం మానేశాను. ఇక కొండచిలువ తనకి అందినదే తింటుంది . . ఆహరం దొరకనప్పుడు బాధపడదు. అందనివాటి గురించి ఆరాటపడకూడదనే విషయాన్ని దాని నుంచి తెలుసుకున్నాను. అందువలన అవే తన గురువులు అని ఆయన చెప్పడం ప్రహ్లాదుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.