పరమశివుడే దిగివచ్చి పంట కోశాడు
పరమేశ్వరుడి రూపాన్ని మనసంతా నింపుకుని, ఆ స్వామి నామాన్ని అనుక్షణం స్మరిస్తూ తరించిన మహాభక్తులు ఎంతోమంది వున్నారు. అలాంటి భక్తుల జాబితాలో 'నందనార్' ఒకరుగా కనిపిస్తారు. అనునిత్యం పరమశివుడిని తలచుకుంటూనే నందనార్ తన పనులు పూర్తిచేసుకునేవారు. 'చిదంబరం' వెళ్లి నటరాజస్వామివారి దర్శనం చేసుకోవాలనే కోరిక ఆయనకి ఎప్పటి నుంచో ఉండేది. అయితే ఆయన ఆ క్షేత్రానికి వెళితే పనులు ఆగిపోతాయని యజమాని ఏదో ఒక పని చెబుతూ అడ్డుపడుతూ ఉండేవాడు.
రాన్రాను 'చిదంబరం' వెళ్లాలనే కోరిక మరీ ఎక్కువ కాసాగింది. అదే విషయాన్ని యజమానికి చెబితే .. వందల ఎకరాల్లోని పంట కోత పనులు పూర్తిచేసి .. ఆ పంటను ఇంటికి చేర్చి 'చిదంబరం' వెళ్లమన్నాడు. మరుసటి ఉదయమే చిదంబరానికి బయల్దేరాలనుకున్న బలమైన కోరిక నీరుగారిపోవడంతో, పొలం దగ్గరికి వెళ్లి ఏడ్చి ఏడ్చి అక్కడే స్పృహ కోల్పోయాడు నందనార్. దాంతో ఆ సదాశివుడే తన గణాలతో దిగివచ్చి చకచకా పనులు మొదలుపెట్టేసి .. ఆ రాత్రే ధాన్యాన్ని యజమాని ఇంటికి చేర్చాడు. ఏం జరిగిందన్నది నందనార్ కి తెలియదు .. యజమాని మాత్రం ఆశ్చర్యపోతూనే 'చిదంబరం ' వెళ్లడానికి ఆయనకి అనుమతిని ఇచ్చాడు. ఇదంతా శివయ్య అనుగ్రహమేననుకుంటూ నందనార్ అక్కడి నుంచి ఆనందంతో బయల్దేరాడు.