దేవతలు .. వాహనాలు
సముద్రం .. కెరటాలతో కూడి ఉండటం ఎంత సహజమో, జీవితమన్నాక కష్టసుఖాలు ఉండటం అంతే సహజం. అందుకే తమకి కష్టాలు వచ్చినప్పుడు అంతా కూడా తమ ఇష్ట దైవానికి చెప్పుకుంటూ వుంటారు. తమకి సుఖాలు కలిగితే తమ ఇష్టదైవం చల్లగా చూడటం వల్లనేనని అనుకుంటారు. ఇలా ఆరాధించబడే దేవతలకి కూడా వాహనాలు వుంటాయి .. వాటిపైనే వాళ్లు ప్రయాణిస్తూ వుంటారు.
అలా ఆయా దేవతల వాహనాలను పరిశీలిస్తే .. బ్రహ్మ దేవుడి వాహనంగా 'హంస' .. విష్ణు భగవానుడి వాహనంగా 'గరుడ పక్షి' .. శివుడి వాహనంగా 'ఎద్దు' కనిపిస్తూ ఉంటాయి. ఇక సూర్యభగవానుడి వాహనంగా 'ఏడు గుర్రాలు' కలిగిన రథం .. వినాయకుడి వాహనంగా 'ఎలుక' .. కుమారస్వామి వాహనంగా 'నెమలి' .. హనుమంతుడి వాహనంగా 'ఒంటే' దర్శనమిస్తాయి. దేవేంద్రుడి వాహనంగా 'ఏనుగు' .. యమధర్మరాజు వాహనంగా 'దున్నపోతు' .. మన్మథుడి వాహనంగా 'చిలుక' కనిపిస్తాయి. ఇక లక్ష్మీదేవి వాహనంగా 'గ్రుడ్లగూబ' .. గంగాదేవి వాహనంగా 'మొసలి' .. యమున వాహనంగా 'కూర్మం' దర్శనమిస్తాయి.