ఆయురారోగ్యాలను ప్రసాదించే కుమారధార తీర్థం
కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు కొలువైన పరమపవిత్రమైన క్షేత్రం తిరుమల. సప్తగిరులతో ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మహా శక్తిమంతమైనదిగా చెప్పబడే ఈ క్షేత్రంలో అనేక పుణ్యతీర్థాలు వున్నాయి. ఒక్కో పుణ్యతీర్థం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని .. ఒక్కో పుణ్య ఫలాన్ని అందించడం విశేషం. అలాంటి పుణ్య తీర్థాలలో ఒకటిగా 'కుమారధార తీర్థం' కనిపిస్తుంది.
పూర్వం ఒక బ్రాహ్మణుడు వృషభాచలమున తపస్సు చేసుకుంటూ వున్నాడట. ఆయనకి నూరేళ్లు వచ్చి శరీరం సహకరించకపోయినా, భగవంతుడి సేవ చేసుకోవడానికి ఆరాటపడుతున్నాడు. అది గమనించిన వేంకటేశ్వరస్వామి ఒక యువకుడి రూపంలో ఆయన దగ్గరికి వచ్చాడట. ఆ బ్రాహ్మణుడిని కుమార ధార తీర్థం దగ్గరికి తీసుకెళ్లి అందులో స్నానం చేయమని చెప్పాడు. ఆ పుణ్యతీర్థంలో స్నానం చేసిన ఆ బ్రాహ్మణుడు యవ్వనవంతుడిగా మారిపోయాడట. అలా ఆ స్వామి ఆ భక్తుడికి యవ్వనంతో పాటు ఆయురారోగ్యాలను ప్రసాదించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.