కోపాన్ని వదిలిపెడితేనే ముక్తి లభిస్తుంది
పరమశివుడిని అదే పనిగా ఆరాధిస్తూ .. ఆ స్వామి సేవలో తరించిన మహా భక్తులలో 'మాది రాజయ్య ' ఒకరుగా కనిపిస్తాడు. రాజుగా తన రాజ్యాన్ని పరిపాలిస్తోన్న రాజయ్యకి, భోగాల పట్ల విముఖత కలుగుతుంది. దాంతో శివారాధన చేస్తూ ముక్తిని పొందాలనే ఆలోచనతో శ్రీశైలం చేరుకుంటాడు. అక్కడ ఆయనకి శివుడు దర్శనమిచ్చి .. ఆయనలోని కోపం తగ్గితేనే మోక్షం లభిస్తుందని చెబుతాడు. ధ్యానంతో కోపాన్ని దూరం చేసుకోమని చెప్పి అదృశ్యమవుతాడు.
దాంతో ఓ చెట్టుక్రింద కూర్చుని మాది రాజయ్య ధ్యానంలోకి వెళతాడు. కొంతకాలం తరువాత పశువుల కాపరులు కొందరు అటుగా వచ్చి, ఆ చెట్టు కొమ్మలు కొట్టడం మొదలుపెడతారు. దాంతో ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన మాది రాజయ్య, వాళ్లపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. అప్పుడు శివుడు మళ్లీ ప్రత్యక్షమై, అదంతా తన లీలా విశేషమనీ .. ఆయనలోని కోపం పోలేదని గుర్తుచేస్తాడు. బసవేశ్వరుడి దగ్గరే ఉంటూ .. ఆయన సేవలో కోపానికి దూరమైతే ముక్తి లభిస్తుందని చెబుతాడు. అలాగే చేసిన మాది రాజయ్య .. ఆ తరువాత కాలంలో ముక్తిని పొందుతాడు.