హనుమంతుడి పేరు వెనుక కథ
హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో .. ఎంతటి జ్ఞాన సంపన్నుడో .. అంతటి వినయశీలి. అనుక్షణం రామనామ స్మరణ చేస్తూ .. తనని సేవించే భక్తులను ఆయన కటాక్షిస్తూ ఉంటాడు. అలాంటి హనుమంతుడికి ఆ పేరు రావడం వెనుక పురాణ సంబంధమైన కథ ఒకటి వుంది. పూర్వం దేవలోకానికి చెందిన 'పుంజికస్థల' అనే అప్సరస, శాపం కారణంగా భూలోకాన 'అంజన' పేరుతో జన్మిస్తుంది. యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆమె, వానరుడైన 'కేసరి'కి భార్య అవుతుంది. వాయుదేవుడి వరప్రసాదం కారణంగా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది.
వాయు పుత్రుడు కావడం వలన ఆ బాలుడు ఆకాశమార్గాన ప్రయాణించే శక్తిని పొందుతాడు. ఒక రోజున ఆయన సూర్యుడిని చూసి అదొక ఫలమని భావించి .. అక్కడికి దూసుకుపోతుంటాడు. 'రాహువు' ద్వారా ఈ విషయం తెలుసుకున్న 'దేవేంద్రుడు' .. తన వజ్రాయుధాన్ని ఆ బాలుడిపై ప్రయోగిస్తాడు. దాంతో అక్కడి నుంచి పడిపోయిన ఆ బాలుడికి ఎడమ 'దవడ' విరుగుతుంది. హనుములు అంటే 'దవడలు' అని అర్థం. హనువు విరిగిన కారణంగానే ఆయనకి హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత ఆయన సూర్యభగవానుడిని ఆశ్రయించి సకల శాస్త్రాలను అభ్యసించడం, సీతాన్వేషణలో శ్రీరాముడికి సహకరించడం తెలిసిందే. హనుమంతుడికి తమలపాకులతో ఆకు పూజ చేయించి .. అప్పాలు నైవేద్యంగా సమర్పించడం వలన, ఆయన ప్రీతి చెందుతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.