అహంభావం అందరినీ దూరం చేస్తుంది
అహంభావం అన్నిటికంటే ముందుగా విడువదగినదనే విషయాన్ని మహర్షులు చెబుతూ వచ్చారు. అహంభావం వలన అనర్థమే తప్ప .. మంచి జరిగిన దాఖలాలు లేవు. అందుకు ఉదాహరణగా అనేక సంఘటనలు ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తూ ఉంటాయి. నా అంత గొప్పవాడు లేడు అనే అహంభావం వలన వివేకం నశిస్తుంది. ఫలితంగా నిజానిజాలను తెలుసుకుని అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమవుతుంటారు. అహంభావం వున్న చోటున మానవత్వానికి .. ప్రేమానురాగాలకు చోటు ఉండదు.
ఎక్కడైతే ప్రేమానురాగాలు పంచబడవో అలాంటి చోటుకు అందరూ దూరంగా వుంటారు. ఈ కారణంగానే అహంభావం కలిగినవారికి స్నేహితులు .. బంధువులు దూరమవుతుంటారు. అయితే ఇంతటి అహంభావం కలిగినవారిని కూడా భగవంతుడు వదిలేయడు. తమ కండబలం .. సిరిసంపదలు చూసి మిడిసిపడే వారికి ఆయన తనదైన పద్ధతిలో పరీక్షలు పెడతాడు. తమ అజ్ఞానాన్ని తెలుసుకుని తాము ఎంత అల్పులమనే విషయాన్ని గ్రహించేలా చేస్తాడు. భగవంతుడు ఎంతటి శక్తిమంతుడో తెలుసుకుని ఆయన గొప్పతనాన్ని అంగీకరించేలా చేస్తాడు. అలా భగవంతుడి లీలావిశేషాల కారణంగా అహంభావాన్ని విడిచిపెట్టి .. దానధర్మాలు చేస్తూ తరించినవాళ్లు ఎందరో వున్నారు.