భీముడి శివభక్తిని గురించి తెలుసుకున్న అర్జునుడు
పరమశివుడి కోసం అర్జునుడు కఠోర తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు. దాంతో తనకంటే గొప్ప శివ భక్తులు లేరనే గర్వం ఆయనలో తలెత్తింది. ఈ విషయాన్ని గురించే ఒకసారి ఆయన కృష్ణుడి దగ్గర ప్రస్తావిస్తాడు. అర్జునుడికి నిజం తెలియాలనే ఉద్దేశంతో ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి తీసుకెళతాడు కృష్ణుడు. భూలోకంలో పరమశివుడికి భక్తితో భక్తులు సమర్పించిన బిల్వదళాలు .. పూలు కైలాసంలో రాసులుగా పోసి ఉండటం అర్జునుడు చూస్తాడు.
ఎంతో కాలంగా తాను శివుడిని పూజిస్తూ వచ్చినా, తన పూల రాశి పరిమాణం చాలా తక్కువగా ఉండటం చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఆ పక్కనే వున్న కొండంత పూల రాశిని చూసి .. అవి ఏ భక్తుడు సమర్పించినవని అక్కడే వున్న నందీశ్వరుడిని అడుగుతాడు. ఆ పూలరాశి భీముడు సమర్పించిందని తెలిసి బిత్తరపోతాడు. తనకి తెలిసి భీముడికి ఆ స్థాయిలో పూజ చేసేంత తీరిక లేదని .. అది ఎలా సాధ్యమైందని కృష్ణుడిని అడుగుతాడు. భీముడు ఏ పని చేస్తున్నా శివ నామస్మరణ మరువలేదనీ, మానసికంగా అంకితభావంతో ఆయన చేసిన అర్చనకి నిదర్శనమే ఆ పూల రాశి అని కృష్ణుడు చెబుతాడు. మానసిక పూజలోని గొప్పతనం అర్జునుడికి అప్పుడు అర్థమవుతుంది.