ధర్మాన్ని ఆచరించేవారి పట్లనే భగవంతుడి అనుగ్రహం
ధర్మాన్ని ఆచరించేవారిని ఆ ధర్మమే కాపాడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో మహర్షులు ఇదే మాటను సెలవిచ్చారు. ధర్మ బద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ భగవంతుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. భగవంతుడు ధర్మ ప్రియుడు .. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ వుంటారో .. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ వుంటారో వాళ్ల పట్ల భగవంతుడు ప్రీతిని కలిగి ఉంటాడు. ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదిలిపెట్టని వాళ్లను ఆయన గట్టిగా పట్టుకుంటాడు. ధర్మస్వరూపుడై ఆదుకుంటూ ఉంటాడు.
ధర్మం తప్పకుండా నడచుకున్నంత వరకూ తన సహాయ సహకారాలు లభిస్తూ వుంటాయని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి .. అవకాశాన్ని బట్టి కొంతమంది ధర్మ మార్గంలో నుంచి బయటికి వచ్చేస్తుంటారు. ధర్మాన్ని ఎవరైతే విడిచిపెడతారో .. వాళ్లు భగవంతుడి కరుణామృత దృష్టికి దూరమవుతారు. ధర్మాన్ని ఆశ్రయించిన .. ఆచరిస్తోన్న వారి పూజలను మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడనే విషయాన్ని మరిచిపోకూడదు.